పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హోదా హామీ అమలు కాలేదు

Views: 49
Avantgardia

పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హోదా హామీ అమలు కాలేదు

ఇచ్చిన హామీలు నిర్ణీత వ్యవధిలో అమలు చేస్తేనే పార్టీలు సభలో ఆందోళనలు ఆపుతాయి

‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు మద్దతిస్తున్నాం

పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులను 90 రోజుల్లో పరిష్కరించాలి

రాజీనామా చేయకుండా చేర్చుకుంటే ఆ పార్టీలపై అనర్హత వేటు వేయాలి

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీని కోరిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పార్లమెంట్‌ను నేను ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తాను.లోక్‌సభలో 22 మంది సభ్యులతో కూడిన నాలుగో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా నేనొక మౌలిక ప్రశ్నను మీ ముందుంచుతున్నా. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు 2014, ఫిబ్రవరిలో ముందస్తు షరతుగా నూతన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పార్లమెంట్‌ స్పష్టమైన హామీ ఇచ్చింది. దీన్ని ఐదేళ్లయినా నెరవేర్చకపోతే ప్రజాస్వామ్య దేవాలయంగా కొలుస్తున్న పార్లమెంట్‌ను ప్రజలు ఇంకా ఎంతకాలం విశ్వసిస్తారు?
– సీఎం వైఎస్‌ జగన్

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కాలేదని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఐదు అంశాల ఎజెండాతో ప్రధాని నేతృత్వంలో బుధవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు మార్గాలు, ఒకే దేశం–ఒకే ఎన్నిక, 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి నవభారత నిర్మాణం, మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆకాంక్ష (వెనుకబడిన) జిల్లాల అభివృద్ధి అనే ఐదు అంశాలు ఎజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ అఖిలపక్ష భేటీకి పలు పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎజెండాలోని అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు మద్దతు పలికారు. అలాగే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు రాజ్యాంగంలో పదో షెడ్యూలును, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించారు. మహాత్ముడి 150వ జయంతిని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో విద్యా రంగంలో, ఆరోగ్య రంగంలో పటిష్ట పథకాలు ప్రకటించాలని కోరారు. సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఇలా సాగింది..

‘పార్లమెంటరీ విలువలు, సంప్రదాయాలపై నాకు అపార గౌరవం, భక్తి ఉన్నాయి. పార్లమెంట్‌ను నేను ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తాను. లోక్‌సభలో 22 మంది సభ్యులతో కూడిన నాలుగో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా నేనొక మౌలిక ప్రశ్నను మీ ముందుంచుతున్నా. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు 2014, ఫిబ్రవరిలో ముందస్తు షరతుగా నూతన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పార్లమెంట్‌ స్పష్టమైన హామీ ఇచ్చింది. దీన్ని ఐదేళ్లయినా నెరవేర్చకపోతే ప్రజాస్వామ్య దేవాలయంగా కొలుస్తున్న పార్లమెంట్‌ను ప్రజలు ఇంకా ఎంతకాలం విశ్వసిస్తారు? మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించగల సామర్థ్యం ఉండి.. ఆ విభజనకు ముందస్తు షరతుగా విధించిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చగలిగే సామర్థ్యం లేకపోవడాన్ని పార్లమెంట్‌ ఎలా సమర్థించుకుంటుంది? ఇది ఏరకమైన న్యాయం? ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలంటే, గౌరవాన్ని పొందాలంటే పార్లమెంట్‌ ఇచ్చిన ప్రతి హామీని నిర్ణీత వ్యవధిలో, తూచా తప్పకుండా అమలు చేయడం తప్పనిసరి. అప్పుడే బాధిత పార్టీలు సభలో ఆందోళన చేయడం ఆపుతాయి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

(Except these headline  content taken in the sakshi news)

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *

£0.000 items